అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం . ఆ వెనక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారుపూత అమరేశ్వరాలయ శిఖరం . ఎత్తయిన ఆ శిఖరానికి చుట్టూతా ఎన్నో ఆలయాలు . ఎన్నెన్నో శిఖరాలు . తూర్పున వైకుంఠపురం కొండ , దక్షినాన పాడుపడ్డ బౌద్ధ స్తూపాలు , పడమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనుల రాజధాని ధాన్యకటకం , ఉత్తరాన ఆ స్తూపాల్ని , ఆ దిబ్బల్ని వాటి మధ్య ఉండే ప్రజల్ని , ఆ ఊర్ని వడ్డాణంలా చుట్టి గలగల పారుతున్న కృష్ణానది , అద్గదీ అమరావతి !
 ఒకనాడు గుర్రాలూ , రథాలూ తిరుగుతూండగా సైనిక విన్యాసాలు జరిగిన ఆ రాజవీధిలో ఇవ్వాళ కుక్కలూ , గాడిదలూ , మేత దండగని ఊరుమీద తోలేసిన సాంబయ్యగారి ముసలి ఎద్దూ నీరసంగా తిరుగుతున్నాయి . రత్నాల రాసులూ , ముత్యాల మూటలూ బళ్ళకెత్తుకు నడిపించిన ఆ వీధిలో ఇవ్వాళ పొట్టు బస్తాలు లాగుడు బండిమీద తొయ్యలేక తొయ్యలేక తోస్తున్నారు . అంత పెద్దవీధి ఎవరు వూడ్చి శుభ్రం చేస్తారు ? ఎవరిళ్ళ ముందు వాళ్ళు వూడ్చుకుని కళ్ళాపు జల్లుకొని కసువంతా నడిబజార్లో పోస్తారు . ఆ కసువు కుప్పల మీద కుక్కలు ముడుచుకు పడుకుంటే , ఇంకోపక్క కోళ్ళు , కోడిపిల్లలు ముక్కులో కెలుకుతుంటాయి . ఒకనాడు భేరీలు మోగించే ఉత్తర గాలిగోపురంలో పిచ్చి సూరిగాడు పీలికలు కాళ్ళనిండా చుట్టుకొని గంజాయి దమ్ము లాగుతున్నాడు . ఆ విశాల వటవృక్షాల కింద , ఒకనాడు శ్రవణపర్వంగా వేదగానం విన్పిస్తే , ఇవ్వాళ " నాకొడకా ! నా ముక్కకి అడొచ్చావు గదరా ! " అంటూ పేకాట జోరుగా సాగుతోంది . 
గంటలు బౌద్ధ విశ్వవిద్యాలయంలో కొన్ని వేల మంది దేశ , విదేశీ విద్యార్థులకు జ్ఞానోపదేశం చేసినచోట - దిబ్బలు , వొట్టి దిబ్బలు కన్పిస్తున్నాయి . దిగులుగా ఉన్న ఆ దిబ్బల మీద పందులు తిరుగుతున్నాయి . వాటిని అదిలిస్తున్న వడ్డీరోళ్ళ పోరగాళ్ళు కన్పిస్తున్నారు .
 కృష్ణకి నీళ్ళకెళ్తున్న ఓ పడుచుపిల్ల ముత్యాల కాలిపట్టీ జారిపోతే “ కంగా రెందుకులే ” అనుకుని ఆ పిల్ల కృష్ణలో నీళ్ళు ముంచుకుని ఆ బిందె ఇంట్లో పెట్టి తిరిగివస్తే ఆ ముత్యాలపట్టి అక్కడే భద్రంగా ఉండగా కాలికి తగిలించుకొని గునగున వెళ్ళిపోయిందట . ఇవ్వాళ కృష్ణకి నీళ్ళకెళ్తున్న చాలామంది ఆడపిల్లలకి కాలి పట్టీలు లేవు . అయినా గునగున నడిచిపోతూనే ఉన్నారు . ముఖాలు నవ్వుతూనే ఉన్నాయి గుండెల్లో ఎంత దిగులున్నా . 
అప్పటికీ ఇప్పటికీ సాక్షి ఆ కృష్ణవేణి . గతాన్ని కడుపులో దాచుకుని ఏమీ తెలియనట్టు నిండుగా ప్రవహిస్తోంది . కృష్ణమ్మ అమరేశ్వరుడి గుడి గోడలొరసి పారుతోంది . పరమేశ్వరుడికి పాదాభిషేచనం చేస్తూ ముందుకెల్తోంది . అల్లంత దూరాన , సూరీడు రాతిరేళ పడుకునే చోటు నుంచి బయలుదేరి పరుగు పరుగున అమరావతి వైపుకొస్తున్నాడు . కన్ను సారించి చూస్తే రెండు కొండకొమ్ముల మధ్యనుంచి వచ్చే కృష్ణ కావలసిన చుట్టం ఊరునుంచి వస్తున్నట్టుంటుంది . తుళ్ళి తుళ్ళి పారుతోంది . మళ్ళీ మళ్ళీ పారుతోంది.తలంటు పోసుకొని విప్పుకున జుట్టులా పాయలు పాయలుగా పారుతోంది . 
ఆ జుట్టుని బంధించి జడగా అల్లినట్లు ఏకపాయగా పారుతోంది . ఇంకా తెల్లారలేదు . దొడ్లల్లో హోరు , ఊళ్ళో హోరు . ఉన్నట్టుండి కృష్ణ పొంగింది . రాత్రికి రాత్రి వరదొచ్చింది . ప్రళయంగా పొంగింది . ఆ మసక వెల్తుర్లో కృష్ణ గర్జిస్తూ ఇంకా పొంగుతోంది . దొడ్లల్లో నడుమెత్తు నీళ్ళు వచ్చేశాయి . జనం గోల , హడావుడి , తోసుకోటాలు , మట్టిగోడలు విరిగిపడిపోతున్నాయి . గుడిపక్క వీధిలో ఉన్న ఇళ్ళు ఎత్తుమీద ఉన్నా దొడ్లో సామానంతా రాత్రికి రాత్రే కృష్ణలో కలిసిపోయింది . 
పల్లవీధి మూడొంతులు మునిగిపోయింది ! 
మిట్టి మీదికి నీళ్ళెక్కుతున్నాయి ! 
యానాదుల గుడిసెలు ఎగిరిపోయాయి !
కొట్టాల్లో పశువులు కట్టు గొయ్యల్తో సహా కృష్ణలో కలిసిపోయాయి !
 రేవులో పడవలు గల్లంతు ! 
లాంచీలు లంగర్లు లాగేసుకుని ఎటో పడిపోయాయి ! 
తెలతెలవారుతుంటే కృష్ణమ్మ ప్రళయరూపం కన్పించింది . ఈ భూమిని మింగేద్దామన్నంత కోపంతో పొంగుతోంది . అవతలొడ్డు కానటం లేదు . ఎదురుగా జలసముద్రం , ఎగిరెగిరి పడున్న అలలు . ఆ మహాప్రవాహం మధ్యలో కొట్టుకు పోతున్న ఇళ్ళ కప్పులు , క్షణంలో ఓ కప్పు నీళ్ళలో కలిసిపోయింది . మోరలెత్తి అంబా అని అరుస్తున్న పశువులు కొట్టుకుపోతున్నాయి . మోరలు మునిగి పోతున్నాయి . ఆ వడిలో కొమ్ములు మునిగిపోతున్నాయి . కొట్టుకొస్తున్న దుంగలు , కలప . ఓ దుంగ మీద వూర కుక్కొకటి దీనంగా మొరుగుతోంది రక్షించమని . ఆ వేగానికి దుంగ మెలికలు తిరుగుతుంటే తనూ గిర గిర తిరుగుతూ కాళ్ళు నిలదొక్కుకుంటోంది ప్రాణభయంతో ఉన్న కుక్క .
 అంతలో ప్రవాహం మధ్య నుంచి ఓ మనిషి కేక “ దేవుడోయ్ ! రచ్చించండి " అని గుండెలు చీల్చుకుపోయే కేక . క్షణంలో ఆ కేక దూరమైంది . మనిషి కన్పించ లేదు . ఎవరూ ఏం చెయ్యలేరు . సాయానికి ఎవరైనా వెళ్తే ఆ వడికి తిరిగి రాలేరు . నిస్సహాయంగా ఆ బీభత్స భయానక దృశ్యాల్ని చూస్తున్నారు వొడ్డున నుంచున్న జనమంతా . అందరి గుండెల్లో భయం . 
ఇళ్ళ ముందుకు నీళ్ళు రావడంతో పిల్లలంతా కాగితం పడవలాట లాడుకుంటున్నారు . పడవలు చేసి పెట్టమని పెద్దల్ని వేధిస్తున్నారు . స్కూలు పిల్లలు గోడమీద బొగ్గుగీతలు గీసి క్షణ క్షణం పెరుగుతున్న నీటి మట్టాన్ని కొలుస్తున్నారు .
 “ పల్లవీధిలో అర్థరాత్రేళ సంగయ్యింట్లో పసిపిల్లకి తడి తగిలి అదేడిస్తే లేచాడంటయ్యా ! అప్పటికి గోడలిరిగె . నీళ్ళు తోసుకొచ్చె ! పెళ్ళాం పిల్లలూ పానాల్తో బయట కొచ్చారంట ! " 
“ మిట్టమీది ఎంకటసామి మేకల మందంతా కొట్టుకపోతుంటే ఏం చెయ్యలేక సూస్తా నుంచున్నాట్టయ్య ! ” 
“ సాలె పేటలో వరదలో కొట్టుకొచ్చిన పాము ఇంట్లో దూరి సుబ్బయ్యని కరిచిందట ! "
 " లంకల్లో మేతకెళ్ళిన గొడ్లు , పాలేళ్ళు ఏవయినారో ! " 
ఇలా భయంకరమైన కథలు చెప్పుకొంటున్నారు . కొందరు ఇల్లాళ్ళు కృష్ణమ్మని శాంతించమని పసుపు , కుంకుమ అర్పించి కొబ్బరికాయలు కొడ్తున్నారు . పిల్లలు కొబ్బరి ముక్కల కోసం ఎగబడ్తున్నారు . ఊరు సగం మునిగిపోయింది . దొరికిన సామాన్లతో జనమంతా ఊరి మధ్యనున్న మాలక్షమ్మ వారి చెట్టు దగ్గర చేరారు . చంటి పిల్లలకి చెట్లకే ఉయ్యాలలు వేశారు . పదిగంటల వేళ వరద తగ్గుముఖం పట్టింది . వూళ్ళో పెద్దలు వెంకటస్వామి , వీరాస్వామి , అవధాన్లు అంతా మాలక్షమ్మ వారి చెట్టు దగ్గర కొచ్చారు . 
" ఇప్పుడేం చేద్దాం ? ఏం చేద్దాం ? ” అని తలపట్లు పట్టుకున్నారు .
 చేసేదేముందయ్యా ? ముందీ జనానికి తిండీ తిప్పలూ చూడండి ” అన్నారెవరో . అంతే ! పదిమంది కుర్రాళ్ళు గడ్డపారలు తీసుకుని గాడిపొయ్యి తవ్వేశారు . ఇంకో పదిమంది గోతాలు తీసుకుని ఇంటింటికీ వెళ్ళి బియ్యం వసూలు చేశారు . కోటలో వంటసామాగ్రి తెచ్చారు . పప్పూ , ఉప్పు , నెయ్యి , నూనె వాటంతట అవే వచ్చాయి . ఎసట్లో బియ్యం పోశారు . వంట నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు , శోభనాద్రి “ ఇహ కూరలే ఆలస్యం " అన్నారు . అవధాన్ల గారి భార్య , కోమటి సూరమ్మ , తెలగ వెంకమ్మ , గొల్ల సుబ్బమ్మ కత్తిపీటలు ముందేసుకుని చకచక కూరలు తరిగేశారు . పన్నెండు గంటలకల్లా దోసకాయ పప్పు , పులుసు అన్నం తయారయిపోయాయి .
 సెట్టిగారు విస్తళ్ళ కట్టలిస్తే నడిబజారులో బారులుగా విస్తళ్ళు వేశారు . శాస్త్రిగారు సంధ్యావందనం ముగించుకుని తనూ ఓ విస్తట్లో కూర్చున్నాడు . ఇటు ప్రక్క చూస్తే తెలగ సుబ్బారాయుడున్నాడు . ఇంకోపక్క గొల్ల రాములున్నాడు . ఎవరి పక్క ఎవరున్నారో ఎవరికీ పట్టలేదు . భగవన్నామస్మరణలు సాగు తున్నాయి . వడ్డనలయిపోయాయి . శాస్త్రిగారు అవుపోసన పట్టి , నెయ్యికోసం చెయ్యిజాస్తే వడ్డించటానికి వచ్చిన నేతి జాడీ చెంగున వెనక్కు వెళ్ళింది . వడ్డిస్తున్న మాలసంగడు శాస్త్రిగారికి వడ్డించటం ఇష్టం లేక పారిపోతున్నాడు . శాస్త్రిగారు “ ఓరే సంగా ! ” అని పెద్దగా కేక పెట్టే , భయం భయంగా వొచ్చిన సంగణ్ణి చూసి “ ఒరే సంగా ! నీకు ఆకలేస్తుంది , నాకూ ఆకలేస్తుంది . ఇంకొకళ్ళు వేస్తే నెయ్యి , నువ్వువేస్తే నెయ్యి కాకపోదురా .... వెయ్యరా " అన్నాడు చెయ్యి ముందుకు చాపి . సంగడు ఆనందంగా వడ్డించాడు . “ నమః పార్వతీపతయే ” అన్నకేకలు దేవాలయ శిఖరాల్నంటాయి .
 వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసిందనుకుందామా ? అబ్బే ! నాకు నమ్మకం లేదు ! స్నానం చేసిన వొంటికి తెల్లారేప్పటికి మళ్ళీ మట్టి పట్టినట్టు మనసుల్లో మళ్ళీ మలినం పేరుకుంటోంది . ఎన్ని వరదలొచ్చినా మనిషి మనసు కడగలేక పోతోంది .
Credits : Amaravathi Kathalu

Buy book 👇