గుండె ధైర్యం కలిగిన చిన్న పిచ్చుక
ఒకసారి ఒక పిచ్చుక సముద్రతీరంలో గుడ్లను పెట్టింది . అయితే ఆటుపోట్ల కారణంగా సముద్రం ముందుకు వచ్చి ఆ గుడ్లను తీసికొనిపోయింది . అప్పుడు పిచ్చుక సముద్రంతో విన్నపము చేస్తూ తన గుడ్లను తనకు ఇచ్చేయమని అడిగింది . ఎన్నిసార్లు అడిగినా పిచ్చుక మాటలను సముద్రము లెక్క చేయలేదు . అయినా పిచ్చుక తన గుండె ధైర్యాన్ని కోల్పోలేదు , విశాలమైన సముద్రాన్ని చూసి హృదయ దౌర్బల్యానికి గురికాలేదు . “ నీవు నా గుడ్లను ఇవ్వకపోతే నిన్ను ఎండింపజేస్తాను " అని పలికి పిచ్చుక తన చిన్న ముక్కుతో ఒక్కొక్క సముద్రబిందువును తీసికొని బయట పడేయడం మొదలు పెట్టింది . నిర్విరామంగా అది చేస్తున్న అసాధారణమైన పని సమస్త లోకానికే వింతను కలిగించింది . రేయింబవళ్ళు లేకుండ ఆ పిచ్చుక రెండు మూడు రోజులు ఆ విధంగా చేసేసరికి కొందరు దాని ధైర్యానికి మెచ్చుకున్నారు , కొందరు నవ్వుకున్నారు . పిచ్చుక చేస్తున్న ఈ అద్భుతమైన కార్యం చివరకు పక్షిరాజైన గరుడునికి తెలిసింది . వెంటనే గరుడుడు పిచ్చుక దగ్గరకు వచ్చి తన మద్దతు తెలిపాడు . పిచ్చుక తరఫున సముద్రంతో మాట్లాడుతూ దాని గుడ్లను తిరిగి ఇవ్వకపోతే పిచ్చుక చేపట్టిన కార్యం తాను పూర్తి చేస్తానని హెచ్చరించాడు . దానితో గరుడుని మహిమ తెలిసి సాగరుడు పిచ్చుక గుడ్లను తిరిగి తెచ్చి ఇచ్చేసాడు.
0 Comments